Saturday, December 12, 2015

ఆంధ్ర రాజధాని లో కాల్ మనీ ఆగడాలు



కాల్ చేస్తే చాలు వాళ్లే ఇంటికి వస్తారు. ఎంత కావాలంటే అంత మనీ ఇస్తారు. ఇక డాక్యుమెంటేషన్ కూడా చాలా ఈజీ. ఎలాంటి షరతులు ఉండవు. కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ. అవసరం కదా అని డబ్బు తీసుకున్నారా చిక్కుల్లో పడ్డట్టే. సమయానికి వడ్డీ చెల్లించలేదో నరకం చూపిస్తారు. పీడించి, వేధించి మరీ వడ్డీలు వసూలు చేస్తారు. కట్టలేదంటే బౌన్సర్లతో దాడులు చేయిస్తారు. వారి కుటుంబంలోని స్త్రీలపై లైంగిక వేధింపులకు పాల్పడతారు. అత్యాచారాలు చేస్తారు. అదీ కాదంటే బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతారు. ఇదీ కాల్ మనీ పేరుతో జరుగుతున్న ఘరానా మోసం. కాల్ మనీ పేరిట ఘరానా మోసాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ముఠా సభ్యులను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. కాల్ మనీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న 12 మందిని టాస్క్‌ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పంటకాలువ రోడ్డులోని ఓ భవనాన్ని కేంద్రంగా తీసుకుని ముఠా సభ్యులు ఈ బాగోతాన్ని నడుపుతున్నారు. ప్రతి రోజు నగరంలో కోట్ల రూపాయలతో కాల్ మనీ వ్యాపారం చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కాల్ మనీ సభ్యులు రోజువారీ వడ్డీగా 10 నుంచి 25 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా అధిక వడ్డీ రేట్లకు అప్పులు ఇవ్వడమే కాకుండా బాధితులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తిచారు. అంతేకాదు బలవంతంగా మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వేధింపులు ఎక్కువ కావడంతో కొందరు బాధితులు నగర పోలీసు కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవహారం వెలుగు చూసింది.
కాల్ మనీ ముఠా రోజుకు కోట్లలో టర్నోవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోసంలో నగరంలోని బడా వ్యాపారవేత్తల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. కోట్ల రూపాయలు విలువ చేసే డ్యాక్యుమెంట్లను సీజ్ చేసిన టాస్క్‌ ఫోర్స్ పోలీసులు.. ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.

No comments:

Post a Comment